బంగారి
బతుకమ్మ
- అల్లం నారాయణ
పూల కలబోత ఎక్కడైనా చూశారా? తంగేడుపూల
స్పర్శనెప్పుడైనా మనసుపొరల్లో నిలుపుకున్నారా! సుతిమెత్తని రేకలుగా విచ్చుకున్న
గుమ్మడి పూల సొగసు మీకు తెలుసా! గాలికి అలలాగా తలలూపే కట్ల చెట్టుకు విరగపూసే నీలి
ఆర్ణవపు కట్లపూలు మీకు తెలుసా! నల్లని గింజల్ని దాచుకున్న మర్మపు పువ్వు గుణుకును
చూశారా! వీటన్నిటి పేర్పే బతుకమ్మ . బతుకమ్మ ఒక పూల జాతర. రంగుల హరివిల్లు. కంచెలు
కంచెలుగా, బీళ్లు బీళ్లుగా విస్తరించుకున్న నీళ్లులేని తెలంగాణలో క'న్నీటి' చెలిమె
బతుకమ్మ. ఉయ్యాలలూపే పాటల పల్లవుల్లో ఆడపడుచుల ఆర్భాటపు పండగ బతుకమ్మ. అంతర్గత
వలసల మూలంగా ప్రాభ వం కోల్పోతున్న, విస్మృతిలోకి దిగజారుతున్న అనేక తెలంగాణ
సంస్కృతీ చిహ్నాల్లాగే విస్మరణకు గురవుతున్నది బతుకమ్మ. ప్రసార, ప్రచార
సాధనాలన్నీ ఆధిపత్య సంస్కృతికి పట్టం గడ్తున్న వేళ వివక్షల అగడ్తలు దాటి
బతుకు పండగైన బతుకమ్మను బతికించుకోవాలి ... హైదరాబాద్ నడిబొడ్డున, తెలంగాణ పల్లె
పల్లెనా ఉయ్యాలో పాటలు హోరెత్తాలి. ఇదే మన సంస్కృతీ చిహ్నానికి గౌరవం.
ప్రతిష్ట. పునరుజ్జీవనం. తెలంగాణ అస్థిత్వానికి ఇదే అసలుసిసలు ప్రతీక. 'సద్దుల'
సంబరాలే మన జీవన పతాక.
ఆశ్వయుజమాసం ..
నీళ్లాడిన కాలం తెరిపినపడుతున్నది.
ఒకానొక సంధ్యా సమయం...
ఎంగిలిపూల అమాస(పెత్తరమాస)
"ఒక్కేసిపువ్వేసి సందమామ
ఒక్క జాములాయె సందమామ''
ఒక తలపోత. ఒక వలపోత. తనను తాను కలుచుకుంటున్న ఒక
ఆర్తి. ఒక సంబరం. తనను తాను తవ్విపోసుకుంటున్న ఆమె పాట. అద ట్లా ఆ మూడు పానాదుల
మీదుగా తేలుకుంటూ తేలుకుంటూ.. పరివ్యాప్తమౌతూ ఆ పల్లెను చుట్టుముడుతున్నది. పాట
సాగుతున్నది. పాటకు లయగా చప్పట్లు. ఆ పల్లె పైన అప్పుడు.. చీక ట్లు కమ్ముకుంటున్న
ఆ రాత్రి పూలవెలుగు ప్రసరించింది. పసుపారబోసినట్టున్న తంగేడుపూలు వెన్నెల
వెలిగినట్టున్న గునుగుపూలు తెలతెల్లని గొట్టాలకు నీలివర్ణమద్దుకున్న కట్లపూలు,
పచ్చగావిచ్చుకున్న బీరపూలు మధ్యలో మెరిసిపోతున్న గౌరమ్మ . పూలన్నీ కుప్పబోసినట్టు
బతుకమ్మలు.. ఆ బతుకమ్మల చుట్టూ.. తీరొక్క పూలవనం చుట్టూ పూల సొగసులద్దుకున్న
ఆడపడచులు.. పాట సాగుతున్నది. 'దూరాన దోరలై/ పట్నాన బంతులై/ దానచ్చెపట్నాన/
దంతపురి గౌరాన/ దొంగలెవరో దోసిరీ గౌరమ్మ/ అన్నలే వరో సూసిరీ గౌరమ్మ' ... 'సినుకు
సినుకుల వాన ఉయ్యాలో/ సిత్తారీవాన ఉయ్యాలో/ గంగదారిలోన ఉయ్యాలో/ బంగారి వాన
ఉయ్యాలో' అవి అనంతం. జాములు తిరిగేదాకా ఆ ఆట సాగుతుంటుంది. అదే బతుకమ్మ. బతుకు
పండగ. ఆటాపాటా కలబోసుకున్న అచ్చ తెలంగాణ ఆడపడుచుల పండగ. భారతదేశంలోనే కాదు.
ప్రపంచంలోనే మరెక్కడా లేని పూలజాతర. పూల ప్రదర్శన. పూల పరిమళం ఆవహించిన నీటి
పండుగ. మెట్ట ప్రాంతపు ప్రజల సామూహిక వెల్లడి.
'నీ మూలాన్ని నువ్వు తె లుసుకో...'
నువ్వెక్కడి నుంచి వచ్చావో ? ఎక్కడ చిన్న పిల్లాడిలా తప్పిపోయావో కానీ ... నిన్ను
నువ్వు వెతుక్కుంటే. తె లంగాణ అస్థిత్వ మూల ప్రతీకగా నీకొక బతుకమ్మ దొరుకుతుంది.
ప్రతి సంస్కృతికీ ఒక ఆవరణ వుంటుంది. అది నువ్వు జీవిస్తున్న కాలం.
పరిస్థితులు. నీటి పారుదల. జీవన స్థితిగతులు. అందుబాటులో ఉన్న వనరులు. సామాజిక
నిర్మాణాలు. ఏవైనా కావొచ్చు. అవి సంస్కృతిని ప్రభావితం చేసే అంశాలు. అవి
సంస్కృతిని రూపొందించే అంశాలు. తెలంగాణ భౌగోళిక పరిస్థితులు. మెట్ట ప్రాంతం.
ఆ మెట్ట ప్రాంత పు పొడినేలల్లో పొద్దు పొడిచినట్టు పూచే పూలు తంగేళ్లు. గునుగులు.
ఆధునికీకరణ, దాన్ని అంటి వచ్చే వ్యాపారీకరణ అంతగా అంటని ప్రాంతం తెలంగాణ.
తెలంగాణకు చెందిన పండగలన్నీ సామూహిక వెల్లడికి చిహ్నాలు. జాజిరాడే కాముని పున్నమి.
చక్కిలాల గుబాళింపులు నిండే సంక్రాంతి. బోనాలు, పీర్లపండగ ఏ పండగ తీసుకున్నా అది
సామూహికంగా, బాహాటంగా, బహిరంగంగా, ఆటపాటలతో జరిగే పండగలే కానీ, ఇంటికి పరిమితం
అయ్యేవికావు. బతుకమ్మ అందుకు మినహాయింపు కాదు.
సత్యవతి కూతురు
సెప్టెంబర్, అక్టోబర్ మాసాల చివర్న లేదా తొలి
అమావాస్య దినాల్లో ఆశ్వయుజమాసంలో వస్తుంది ఈ పండగ. తార్కికత, హేతువు నిర్మితం కాని
రోజుల్లో అన్ని పండగలకూ దేవుడు లేదా దేవత మూలాలు ఆపాదించుకున్నట్టే ఈ పండగకూ అనేక
కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ధర్మాంగదుడనే చోళరాజుకు, ఆయన భార్య సత్యవతికి నూరుగురు
కొడుకులు కలిగారని, ఆ కొడుకులెవరూ బతికి బట్టకట్టలేదని, దాంతో రాజు లక్ష్మీదేవిని
తనకు సంతానం కావాలని కోరితే ఆమె వరప్రసాదం వల్ల కూతురు జన్మించిందని, ఆ కూతురికే
కలకాలం జీవించి ఉండేలా బతుకమ్మ (బతుకు+అమ్మ) పేరు పెట్టారని, ఆమె పేరిటే తెలంగాణ
ఆడపడుచులు ఏటేటా 'బతుకమ్మ' ఆడుతున్నారని ప్రతీతి. ఇక గౌరీదేవి మహిషాసురుని
నిర్మూలించే క్ర మంలో నిద్రలోకి జారుకున్నదని, మహర్షులు ఆమెను తొమ్మిది రోజుల
అనంతరం నిద్రలోంచి మేల్కొలిపారని, అందువల్లే నవరాత్రుల పూజల సందర్భంగా 'బతుకమ్మ'
ఆట ఆడుతారని మరో ప్రతీతి. ఇట్లా దేవదేవతల సంబంధ కథలట్లా వదిల్తే.
నాట్లకు కోతలకు మధ్య కాలం
సెప్టెంబర్, అక్టోబర్ మాసాలు తెలంగాణ ప్రాంతంలో
పనీపాటలు తీరి తీరికగా ఉండేకాలం. జూన్‌లో ఆరంభమయ్యే వర్షాలు ఈ కాలాని కల్లా వెనకకు
పడ్తాయి. వర్షాధార పంటల మీద, చిన్న చిన్న కుంటలు, చెరువులు, బావుల సేద్యం మీద
ప్రధానంగా ఆధారపడే మెట్ట వ్యవసాయపు సాంద్రత కలిగిన తెలంగాణలో అప్పటికి తరిలో
నాట్లు పూర్తయ్యి, తొలి కలుపులు కూడా ఆయిపోతాయి. మొక్కజొన్న, పునాస పంటలైన
పెసరలాంటివి కూడా అన్నీ అయిపోయి రైతులు తీరిగ్గా ఉంటారు. మళ్లీ పంట చేతికి వచ్చే
కాలంలోనూ ఆ పనుల్లోపూర్తిగా మునిగిపోతారు. అందుకే ఈ కొత్త పాత సందు
(కొత్తపచ్చందు)లో దొరికే విరామంలో ఈ పండగ ఉంటుంది. దీనికి ముందే పొలంపనులన్నీ
అయిపోయిన వెంటనే 'పొలాల అమావాస్య'ను కూడా ఘనంగా చేసుకుంటారు. పునాసలు చేతికొచ్చి,
కొద్ది పాటి డబ్బు చేతిలో ఆడడంతో అభిమానాలకీ, ఆప్యాయతలకీ, కుటుంబ సంబంధాలకీ ప్రాణం
ఇచ్చే ఇక్కడి ప్రజానీకం తమ ఆడపడుచులను, అత్తవారిళ్లలో నుంచి పిలుచుకొచ్చుకొని,
చీరెసారె, కానుకలతో సత్కరించే సంప్రదాయం వుంది. ఆధునిక పోకడలు, వ్యాపార సంబంధాలు,
లోకజ్ఞానం తెలిసిన తెలివిడితనం తక్కువయినందు వల్ల ఈ ప్రాంతపు మానవ సంబంధాల్లో
ఇప్పటికీ పురా ఆప్యాయతలు మిగిలే ఉన్నాయి. విరామం, ఆడపడుచు సెంటిమెంట్, ప్రకృతి
అన్నీ కలిసిరావడం వల్లే ఈ పండగ ఎన్నేళ్ళయినా వన్నె తరగకుండా కొనసాగుతున్నదేమో.
పేరుపే ఒక కళ
ప్రతి నదికి ఒక పాట ఉంటుంది. ప్రతి ప్రాంతానికీ ఒక ప్రత్యేకత ఉంటుంది. తనదే
అయిన ప్రత్యేకత వల్ల ఆ ప్రాంతం గుర్తింపు, అస్థిత్వం మిగతా ప్రాంతాలతో
విభేదిస్తుంది. బతుకమ్మ తెలంగాణకు అలాంటిదే. దసరాపండుగకు రెండు రోజుల ముందు జరిగే
'సద్దులు' మొత్తం పండుగలో పతాకసన్నివేశం. ఎంగిలిపూల అమాసనాడు "ఒక్కేసి పువ్వేసి
సందమామ/ ఒక్కజాములాయె సందమామ''అంటూ తొమ్మిది రోజుల పాటు బతుకమ్మలాడిన పల్లెలు
'సద్దుల' నాడు ఈ పండుగను ఘనంగా జరుపుకుంటాయి. బతుకమ్మ కంటే ముందు 'బొడ్డెమ్మ'
ఆడతారు. కన్నెపిల్లలు మట్టితో కానీ, పేడతో కానీ అలంకరించిన బొడ్డెమ్మను ఆడి 'పోపో
బొడ్డెమ్మా/ పోయిరా బొడ్డెమ్మా/ మల్లెన్నడత్తవ్ బొడ్డెమ్మ అంటూ సాగనంపుతారు. ఇక
అప్పుడు అసలు బతుకమ్మ ప్రారంభమవుతుంది. సద్దుల ముందరి రోజు దాకా అంటే ఎనిమిది
రోజులూ సిబ్బుల్లో (వెదురు బద్దలతో అల్లిన పళ్లెం లాంటిది) బతుకమ్మలు పేరుస్తారు.
ఈ పేరుపొక కళ. ముందు గునుగుపూలవరస. ఆనక తంగేడుపూల వరస. ఆ తర్వాత కట్లపూలు, ఆఖరున
గుమ్మడిపూల దొంతర. దాని మధ్యలో పసుపునిండిన గౌరమ్మ. కోణాకారంలో సిబ్బుల్లో
బతుకమ్మలు సింగారించుకుంటాయి. వీధి మొగదలలో, నాలుగు పానాదుల కాడ, గుడికాడ, నలుగురు
కూడే కాడ బతుకమ్మలను గుండ్రంగా ఉంచి వాటి చుట్టూ వలయాకారంలో తిరుగుతూ, చప్పట్లు
కొడుతూ, మోగిస్తూ పాటలు పాడుతూ, లీనమవుతూ, మైమరస్తూ జాముల పొంటి పాటలు పాడుతూ
బతుకమ్మలను ఉయ్యాలలూపుతూ సాగేదే బతుకమ్మ ఆట. ఆడపడుచులు, వారి కష్టాలు, కన్నీళ్లు,
సంబరాలు, వెక్కిరింతలు, అన్నద మ్ముల అండ, రామాయణం, భారతం, పార్వతీపరమేశ్వరులు,
చెరువులు, బావులు, వ్యవసాయం, మంచీ చెడ్డా అన్నీ ఈ పాటలల్లో జాలువారుతూ ఉంటాయి.
కైగట్టే పాటలే
ఈ పాటలు ఎక్కడా రాసిలేవు. వీటికి లిపిలేదు. అవి అక్షరబద్ధమయినవి కావు. ఒక
సన్నివేశం, ఒక గమనం, కొనసాగింపు లో అంతం లేకుండా జానపద సంప్రదాయంలో ప్రధానంగా
'కై' గట్టి (అంటే అప్పటికప్పుడు కూర్చి) పాట పాడుతుంటారు. ఆ రాగంలో అనంతంగా,
నుడుగులు నుడుగులుగా, ఒకే పల్లవిలో హెచ్చుతగ్గుల సాంద్రతల్లో, ఉచ్ఛ, హ్రస్వ
రాగాల్లో పాటలు దీనికి ప్రత్యేకం. ఒకరు ప్రధానంగా పాడుతుంటే.. మిగతా వారందరూ ఆ
పాటను అందుకొని కొనసాగిస్తుంటారు. ఇక్కడ మగవాళ్ల ప్రమేయం లేదు. ఈ బతుకమ్మల దగ్గర
కూచొని పాటలు వినడం, బతుకమ్మలకు అవసరమైన పూలు ఏరుకురావడం తప్ప మగపిల్లలకు
బతుకమ్మలో పాలు తక్కువే. పాడుతుంటే జాములే తెలియవు. బతుకమ్మ ఆట ఏ జాము తిరిగినాకనో
అయిపోయినాక, అందరూ వాటిని తీసుకొని దగ్గరలో ఉన్న వాగుల్లో, వంకల్లో, చెరువుల్లో
బతుకమ్మను సాగనంపుతారు. ఈ సాగనంపడం కూడా వేడుకే. కొత్త పట్టు వస్త్రాలు, కలిగి
ఉంటే బంగారు నగలు, అన్నీ సింగారిచ్చుకొని బతుకమ్మలతో వీధుల్లోకి వస్తారు.
కలిగినోళ్ల బతుకమ్మలను పాలేర్లు, జీతగాళ్లు మోసుకు వస్తే మిగతా వాళ్ళు తామే
నెత్తిన పెట్టుకుని తెచ్చుకుంటారు. ఇక ఆ పొద్దు ఆటకు అంతం లేదు. ప్రధాన పాటగత్తె
తల ఒక వేపు వంచుకొని చప్పట్లు కొడుతూ, బతుకమ్మ చుట్టూ తిరుగుతూ 'సీసకుడ సీసకుడ
ఉయ్యాలో' (కీచకుడు) అని ఎత్తుకున్నదంటే అదిక అనంతం. ఆ పాటల కోసం జాములే మెల్లగా
నడుస్తాయి. రాత్రి నిడివి పెరిగి పెద్దదవుతుంది. ఆడీ ఆడీ అలసినంక ఆడపడుచులు ఆ
బతుకమ్మలను చెరువుల్లోనో, వాగుల్లోనో వేసి వస్తారు. బతుకమ్మలను నీళ్లల్లో వేశాక
తాము ఇళ్లల్లో నుంచి తెచ్చుకున్న సత్తు, మలీద, పప్పు, బెల్లాలు ఒకరికొకరు
ఇచ్చిపుచ్చుకోవడం ఆనవాయితీ, దీన్నే ' ఇచ్చుకో వాయినం/ పుచ్చుకో వాయినం' అంటారు. ఆ
తర్వాత సిబ్బులు తీసుకొని, ఆ శిబ్బిలతో కూడా హాస్యాలు ఆడుకొని 'కుంటి రంగని కోడి
గెలిచే' అనుకొని ఇళ్లకు చేరుకుంటారు.
స్వేచ్ఛ సంస్కృతికి తొలికిస్తీ
'స్వేచ్ఛ సంస్కృతికి తొలికిస్తీ' అంటారు. అట్లాగే 'సంస్కృతి ఆత్మల సమాహారం'
అని కూడా అంటారు. మెట్ట ప్రాంతాల్లో పూచే పూల తేరులు, వ్యవసాయ ప్రధాన అధరువులైన
చెరువులు, బావుల్లోకి పూలను సాగనంపడం, ఆడపడుచుల గౌరవం అనే మూడంశాల చుట్టూ తిరిగే
ప్రకృతి పండగబతుకమ్మ. ఎలాంటి ఆటంకాలు, మొహమాటాలు లేకుండా స్వేచ్ఛగా, తమని తాము
స్త్రీలు వెల్లడించుకోవడం కూడా బతుకమ్మ సారాంశం. ఇందుకు సాధనం పాటలు. ఆటలు.
తెల్లవారితే దసరా.. దసరా అంటే తినడం, తాగడం ఒక్కటే కాదు. జమ్మి సందర్శన,
పాలపిట్టను చూడడం, జమ్మి ఆకు తెచ్చి పెద్దల దీవెనలు అందుకోవడం. జమ్మి వద్దకు యాటను
బలివ్వడం మరొక సంప్రదాయం.
హైదరాబాద్‌లో కూడా బతుకమ్మ సజీవంగా ఉంది. ముస్లింలు,
హిందువులు, మరాఠీలు, కన్నడిగుల సమ్మిశ్రిత సమ్మేళన సంస్కృతి హైదరాబాద్‌ది.
భాష సహజంగానే ఈ నాలుగు రకాల యాసలతో కలగలిసి వుంటుంది. హైదరాబాద్‌లో ముస్లింల
'జగ్నేకీరాత్' కూడా అయిపోయిన కాలంలో దసరా వస్తుంది. అందువల్లే ఇది కలివిడిపండుగ.
ఇప్పటికీ హైదరాబాద్ బస్తీల్లో బతుకమ్మల సందడి మిగిలే ఉంది.
కానీ, ఆధిపత్య సంస్కృతులు, వలసలు ముందుగా సంస్కృతి మీద దాడి చేస్తాయి.
తెలంగాణలో కూడా అదే జరిగింది. భాష, యాసలు, జీవన విధానాలు, నడవడికలు, పండుగలు,
పబ్బాలు ... ఇలా వలస సంస్కృతికి బలయిపోయిన విధ్వంస చిహ్నాలు కోకొల్లలు.
ప్రామాణిక భాషపేరిట 'యాస'లకు గౌరవం, గుర్తింపు లేకపోవడం, ఉమ్మడి సమైక్య
సంస్కృతి పేరిట కోస్తాంధ్ర సంస్కృతినే రుద్దడం, తెలంగాణకు సంస్కృతి
లేదనడం కారణంగా 'బతుకమ్మ' లాంటి వాటికి ప్రాచుర్యం లేకుండా పోతున్నది. అసలు
బతుకమ్మ అంటే ఏమిటి? అదెట్లా ఉంటుంది అని తెలియని తరం ఒకటి హైదరాబాద్‌లాంటి
ప్రాంతాల్లో, వలసలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఎదుగుతున్నది. దీనికి తోడు వ్యాపార,
వస్తులౌల్యం పల్లెపట్టులకూ పాకుతున్న తరుణం. మానవ సంబంధాలు విచ్ఛిన్నమవుతున్న
కాలం. నిన్ను నువ్వు మైమరిచిపోయేంత పోటీ ప్రపంచంలో మూలాలకు అర్థం లేకుండా పోతున్న
తరుణం. ఈ అన్ని పరిణామాల ఫలితంగా స్థానిక సంస్కతులకు, బతుకమ్మలాంటి సహజాతమైన
ఆటపాటల సామూహిక వెల్లడికి చోటు తగ్గిపోతోంది.
యాదీ లేదు ఆ మనాదీ లేదు
ఇప్పుడు చాలా పల్లెల్లో ఒకటే దృశ్యం. కొడుకు పట్నంలో
ఉన్నాడు. బిడ్డా పట్నంలోనే బతకడానికి పోయింది. మనవడూ, మనవరాళ్లు అమెరికా వెళ్లారు.
ఇక 'చిన్నోడ సిరికృష్ణ ఉయ్యాలో / చెల్లెను తీస్కరార ఉయ్యాలో' అనే సన్నివేశాలు
ఎక్కడి నుంచి వస్తాయి? ఆ ఆర్తి ఎక్కడిది? ఆ పండగ వాతావరణం ఎక్కడిది.? టీవీలు
నిండుగా దుర్గాష్టమి పండగంటే ఏమి చూపుతున్నారో, ఏమి చెబుతున్నారో అది తెలంగాణకైతే
సంబంధించింది కాదు. ఇప్పుడు హైదరాబాద్‌లో ఎక్కువగా కనిపిస్తున్న సంస్కృతిలో
బతుకమ్మ యాదీ లేదు. 'మనాదీ లేదు.' ఆ తండ్లాటా లేదు. అంతర్గత వలసలు తెలంగాణ
సాంస్కృతిక మూలాలను అణచివేశాయి. దీనికి తోడు క్రమక్రమంగా మారుతున్న
వాతావరణాలు, చిన్న నీటివనరుల పైన అన్ని ప్రభుత్వాల నిర్లక్ష్యం తెలంగాణ
ఎండగట్టింది. బావులు పూడుకుపోతున్నాయి. చెరువులు మేటలువేసి పోతున్నాయి. జలయజ్ఞం
పరిధి పెంచుకొని విస్తరిస్తున్న క్రమం అంతటా కనబడ్తుంటే తెలంగాణలో చెరువులు,
దొరువులు, వాగులు, వంకలు చుక్కనీరు లేకుండా తయారవుతున్నాయి. తంగేడు పూలేవి?
బీరపాదులేవి? అవన్నీ గతంలా తయారవుతున్నాయి. ఈ విపరిణామాల మూలంగా బతుకమ్మ
విస్మృతిలోకి జారుతున్నది.
ఏం చేయాలి?
అనేది ఇలాంటి పరిస్థితుల్లో పెద్ద ప్రశ్న. నిన్ను నువ్వు తెలుసుకోవడమే ఇప్పటి
ఏకైక మార్గం. అందుకే బతుకమ్మను బతికించుకోవాలి. సంస్కృతీ చిహ్నంగా, ప్రపంచం
మొత్తం మీద ఎక్కడాలేనీ ఈ పూలజాతరను, నీటి పండగను బతికించుకోవాలి. బతుకమ్మలు సరే!
జమ్మిచెట్టూ మిగలలేదు. చెరువుతో పాటు అంతరిస్తున్న ఆప్యాయతలు. పెరుగుతున్న గోడలను
కూలగొట్టాలి. మానవీయతా ప్రదర్శనగా ఉన్న సంస్కృతులను బతికించుకోవాలి.
సంస్కృతి బతకకుంటే మనిషి ఎండిపోతాడు. మరలాగా మారి తల్లడిల్లుతాడు.
అస్థిత్వవేదనలో ఎవరు తానని ఒంటరి అవుతాడు. వద్దు ఆ పరిస్థితిని రానివ్వొద్దు మనం.
'బతుకమ్మ! బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు గౌరమ్మ ఉయ్యాలో..' అని చౌరస్తాల్లో నిలబడి
పాటలు పాడుదాం. అంతర్గత వలసల కారణంగా ఎదుర్కుంటున్న సాంస్కృతీ వివక్షను
బతుకమ్మలాడి తిప్పికొడదాం.
పూలు
తంగేడు, గునుగు, కట్ల, బీర, గుమ్మడి, రుద్రాక్ష పూలు. గుమ్మడి పూలలో మధ్య భాగాన్ని
'గౌరమ్మ' అంటారు.
పేర్పు ఇలా
ఎనిమిది రోజులూ 'సిబ్బి' (వెదురు అల్లిక)లో బతుకమ్మలు పేరుస్తారు. గుమ్మడి
ఆకులతో మొదటి వరస పేర్చి వాటిపైన గునుగులు, తంగేళ్లు పేరుస్తారు. చివరగా బీర,
గుమ్మడి, కట్ల, రుద్రాక్ష తదితర రంగు రంగుల పూలు వరుసగా కోణాకారంలో పేరుస్తారు.
మధ్యలో 'గౌరమ్మ'ను ఉంచుతారు. సద్దులనాడు మాత్రం పెద్ద పెద్ద బతుకమ్మలు పేరుస్తారు
కనుక 'తాంబాళం' (స్తాంభాళం) ఉపయోగిస్తారు. పూలు లేని పట్టణాల్లో కాగితం పూల
కృత్రిమ బతుకమ్మలు అమ్ముతారు. హైదరాబాద్ లాంటి చోట్ల అవే ఎక్కువ.
దళితులకు దూరం
బతుకమ్మకు కూడా సామాజిక ప్రతిఫలనాలు తప్పలేదు. బతుకమ్మ ఆట అన్ని కులాల వారు కలసి
ఆడుకోరు. శూద్ర, అగ్రకులాల వారు కలిసిఆడితే, దళితులు మాత్రం విడిగా
ఆడుకోవాల్సిందే. భూస్వామ్య వ్యవస్థ పటిష్టంగా వేళ్లూనుకుని ఉన్న తెలంగాణాలో పండగ
పబ్బాల్లో దళితుల పట్ల వివక్ష ఉంది. అయితే, కొన్ని గ్రామాల్లో దళిత వర్గాల వారు
బాగా పాటలు పాడతారు కనుక వారితో (విడిగా ఉంచి) పాటలు పాడించుకోవడం ఉంది. అయితే
చివరి రోజున దళితులు విడిగా బతుకమ్మలు ఆడుకోవడమూ ఉంది.
'బతుకమ్మ' పోరు
బతుకమ్మలకు 'గడీ'లు, దొరల కోణం కూడా ఉంది. ఒక ఊరికి దొర ఉంటే బతుకమ్మలన్నీ ఆ ఊరి
దొర వాకిళ్లలోకి వెళ్లి ఆడవలసిందే. పల్లె జనం బతుకమ్మలను తీసుకొని వెళ్లి ఆడ్తుంటే
'దొర' కొడుకులు ఆటలాడే ఆడపిల్లలను చూడ్డం, వెకిలి చేష్టలు చేయడం ఉండేవి. అయితే,
నక్సల్బరీ సాంప్రదాయం తెలంగాణలో వేళ్లూనుకున్న తర్వాత డెబ్భై, ఎనభై దశకాల్లో
సంఘాలు ఏర్పడినాక ముందు ఈ చెడుగును పారదోలి, ఊరి మధ్యలో బతుకమ్మలు ఆడటానికి కృషి
చేశారు. ఆ మాటకొస్తే జగిత్యాల, సిరిసిల్ల రైతాంగ పోరాటాల్లో తొలి అమరవీరుడు
లక్ష్మీరాజం బతుకమ్మ పోరాటంలోనే ప్రాణం కోల్పోయాడు. ఇది నమ్మలేకున్నా పచ్చి నిజం.
కరీంనగర్‌లోని ఒక గ్రామంలో దొరల గడీల్లో బతుకమ్మ ఆడే సాంప్రదాయాన్ని బద్దలు
కొట్టినవాడు లక్ష్మీరాజం. ఆ తర్వాత అతన్ని దొరల గూండాలు దాడి చేసి చంపేశారు.
పెద్దపల్లిలో అప్పుడు పెద్ద బహిరంగ సభ జరిగింది. దానికి వరవరరావు లాంటి వారు
వక్తలుగా వచ్చారు.
పరిశోధనలు
తెలంగాణ ప్రత్యేకవాదం మూడోసారి రగుల్కున్నాక బతుకమ్మ అత్యంత ఆసక్తికరమైన
అంశంగా మారింది. దానిమీద పరిశోధనలు, వ్యాసాలు, పుస్తకాలు, పాటల పుస్తకాలు
ప్రచురించారు. ఆంధ్రజ్యోతి దినపత్రిక స్వయంగా భాగ్యనగర బతుకమ్మ ఉత్సవాలు జరపడం
విశేషం. ఇదొక సాంప్రదాయంగా స్థిరపడక తప్పదు. ఆ రకంగా ఆంధ్రజ్యోతి గొప్ప చరిత్రకు
నాంది పలికినట్టే.
ఉద్యమాల ఉయ్యాలో
ఉయ్యాల పాటలు అన్ని రాజకీయ పరిణామాలపైన, కరువు కాటకాలపైన, మూసీ వరదలపైన,
తెలంగాణ సాయుధ పోరాటం నుంచి నక్సల్బరీ, ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ ఏర్పాటుపైనా
ఉన్నాయి. తెలంగాణ జానపదాల ఒరవడి సామూహిక గానానికి అనువుగా ఉంటాయి. కోరస్‌కు
సులభంగా ఉంటాయి. 'వలలో', 'సందమామ', 'ఉయ్యాలో', 'కోల్' ఇట్లా చరణాంతంలో పునరుక్తి
వరుసల వల్ల మంది పాడడం సులభం. అందువల్ల రాజకీయ ఉద్యమాలు ఈ బాణీలను ఉపయోగించుకుని
పాటలు రాశాయి. అల్లం వీరయ్య రాసిన 'సినుకు సినుకుల వాన ఉయ్యాలో/సిత్తారివాన
ఉయ్యాలో' పాటకు మామూలు ఉయ్యాల పాటలకున్నంత ప్రచారం ఉంది.
పాలుమూరుకు 'బతుకు+అమ్మ' లేదు
తెలంగాణ అంతటా బతుకమ్మను ఆడతారు. కానీ మహబూబ్ నగర్ జిల్లాలో ఆలంపూర్
నడిగడ్డ వంటి ప్రాంతాల్లో ఈ ఆటలేదు. ఈ సాంప్రదాయం లేదు. కారణం అది కర్నూలు (సీమ)
సంస్కృతికి దగ్గరగా వుండడం కావొచ్చు. కరువు కాటకాల వల్ల, వలసల వల్ల కూడా
కావొచ్చు. కానీ నీటి కోసం అంగలార్చే పాలమూరులో నీటి పండుగగా భావించే బతుకమ్మ
లేకపోవడం వెలితే.